Saturday, April 18, 2009

రమణస్థాన్ నుంచి | 4-5-1950 | చలం ఉత్తరాలు


4-5-1950
అరుణాచలం






పుడే మీ కార్డు, మీరు హడావుడిగా ఈ ఎండల్లో తిరుగుతున్నారన్నమాట! ఇవాళే 'షౌ ' వాళ్ళూ వొచ్చారు. మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళు ఈ వూళ్ళో వుండరేమో! ఇక్కడికి 50 మైళ్ళలో ఓ స్వాములవారు ఉన్నారు. ఆయన వీళ్ళందరినీ తన దగ్గరే వుండమన్నారు. అక్కడ చాలా హాయిగా అంది వాళ్ళకి. అందుకని అక్కడే ఉంటున్నారు. అడవిలో ఆయన వేసిన పాకల్లో - అంటే కొండల బయలులోనట. నన్నూ రమ్మన్నారు. భగవాన్ ను వొదిలి వెళ్ళలేక పోయాను అప్పుడు. నేను వొంటరిగా వుంటానని నాతో నర్తకి ఉండిపోయింది. నర్తకికీ వెళ్ళాలనే వుంది. ఇంకా భగవాన్ సమాధిని వదలేకుండా వున్నాను, అందరూ వెళ్ళిపోయినా. అది కాక మా సామానులన్నీ యిక్కడే ఉన్నాయి. ఆ స్వాములవారితో వుంటే పక్కలు కూడా ఉండవట. చాపలే. బెజవాడనుంచి తెచ్చుకున్న ఈ సామానులు ఎవరైనా కొంటారేమో చూసి, ఒక్క పెట్టెతో వెళ్ళాలి. చదవడానికి పుస్తకాలన్నా లేకుండా ఉండగలనా అని యోచిస్తున్నాను. ఇప్పుడు రోజుకో గంట చదవలేకుండా ఉండలేకపోతున్నాను. అంత అలవాటయింది చదువు జీవితమంతా!

నా ఆరోగ్యం ఇదివరకన్న నయం. కాని ఆ స్వాములవారితో వుంటే ఏ జబ్బూ ఉండదట. 'షౌ ' కి తలనొప్పులు లేవు. స్నానాలు, పరుపులు, శుభ్రమైన బట్టలు - అన్నీ వుత్త జ్ఙాపకాలై పోతున్నాయి. 15 రోజులకి గడ్డం గొరుక్కోవడం ! Haircut లేనేలేదు. ఇక్కడికి వచ్చాక. ఈ దేశంలో యోగులూ, మహిమలూ, ధ్యానాలూ తప్ప ఇంకేం ఆలోచనా లేదు. ఇంక ఒక్క 10 నెలల తరువాత ఇంక నేనుండనని జాతకంట! చాలా interesting గా వుంది జీవితం;


ఆ వూళ్ళూ సినిమాలూ , పత్రికలూ, హడావిడీ, మంచి భోజనాలూ, నాజూకులూ, శుభ్రాలూ
అన్నీ ఏదో ఇంకో జన్మ! ఎప్పటిదో కల!







Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile