Tuesday, April 7, 2009

చలం స్వాతంత్ర్యసమరంలో ఎందుకు దూకలేదు ? పిరికివాడిగా ఎందుకు మిగిలిపోయాడు ?










బెజవాడ 25-05-1930

నా మౌనాన్ని ఉపేక్ష చేసి మీరు వ్రాసిన ఉత్తరం అందింది. మీకు వ్రాయాలని అనుకోని రోజు లేదు. కాని వ్రాయడానికి ఏమీ లేదనిపించేది. ఒక్కటే వార్త, పూర్నమ్మ పరిచయం అయింది.

చాలా విశ్వాసంగా రోజూ సూర్యనమస్కారాలు చేస్తున్నాను. వినాయకుణ్ణి, అతని తండ్రినీ స్తుతిస్తున్నాను - తరువాత నిద్రపోతాను , లేక బద్దకంగా పడుకుంటాను - ఏమీ చెయ్యటం లేదు, రాత్రంతా నిద్రపోతాను. ఈ నిద్ర నాకు మంచి చేస్తోంది.

వ్రాయడమా? ఎందుకు ? ఏం ఉపయోగం ? ఎవరికి ? వ్రాయడానికి అర్హత వుందా నాకు ?

ఒక్కసారి తెంచేసుకుని జైళ్ళకు వెళ్ళేవాళ్ళతో కలవడం నా ధర్మంకాదా ? ఏ కొన్ని శతాబ్దాలకో, దేశాన్ని సంచలింపచేసే ఉద్రేకాన్ని చూస్తే నా కేమీ ప్రేమలేదు. కాని - ఎందుకూ కొరగాని వాళ్ళు క్షుద్రులు భీరులు ప్రవాహంలో దూకి ఎదురీదుతో ఆ గాలివేగానికి సంతోషిస్తోవుంటే, దగ్గిరకి వెళ్ళడానికి భయపడి, వొడ్డున చూస్తోనుంచున్నాను. దొంగలు, నీచులు, అబద్ధులు, రౌడీలు, వీళ్ళందరూ త్యాగంచేసి, ఆ వొక్కత్యాగంతో, నాకన్న ఆధిక్యతను పొందారు. వెయ్యి సాహసమైన ఆలోచనలకన్న ఒక్క సాహసకార్యం శక్తివంతమైది. ఇతరులకి 'ప్రీచ్ ' చెయ్యడానికి నాకేమి అర్హత వుంది? తొలగి - మరుగుపడి, చూస్తో, ఆశీర్వదించడం వుత్తమం.

కాని ... నవ్వుతో ఒక మిత్రుడితో ' జైలుకి వెళ్ళడం కన్న యీ ముగ్గురిపిల్లల్ని భరించడం కష్టమైనపని ' అన్నాను. నిజం కాదా ? ఇక్కడ ఒక వాలంటీరు వున్నాడు. అతనిపిల్లకి జబ్బుగా వుంది. 'నాకు వ్యవధిలేదు. ఈ పిల్లజబ్బు నా దేశసేవకి ఆటంకంగా వుంది' అని వెళ్ళిపోయినాడు. ఆ పిల్లని పూర్తిగా ఉపేక్షచేశారు బంధువులు. చాలా బాధపడ్డది. చివరికి చచ్చిపోయింది. ఇది హరిశ్చంద్రుడి త్యాగాల మూర్ఖం కాదా ? కొత్తవారి ఇంటో నాపిల్ల డబ్బు లేకపోవడంవల్ల, బాధల పాలవుతోందంటే భరించగలనా ?


నా పిల్లలకంటే నేను దేశాన్ని అధికంగా ప్రేమించటంలేదు. నేనొకవేళ చచ్చిపోతే, అప్పుడు పిల్లలు నిస్సహాయులు కారా అంటే! ఇప్పుడు మరి నేను బుద్ధి పూర్వకంగా వాళ్ళని కష్టాలకి వొదులుతున్నాను కదా ! మృత్యువు నా చేతుల్లో లేదు. వాళ్ళని అన్యాయం చేస్తున్నానని నేను నిందించుకోను అప్పుడు.



నా ఆలోచనలిట్లా వున్నాయి. ప్రతి విషయాన్ని ఇట్లా చీల్చి ఆలోచించే శక్తినిచ్చిన యీ చదువే లేకుండా వుండి, ఏ సంకోచమూ లేకండా ఇటూ అటూ చూడకుండా , తన పిల్లని చంపుకుని దేశసేవకి పోయిన ఆ వాలంటీరుమల్లే, గుడ్డిగా, సంకుచితంగా, నా ధర్మమని మంచికో చెడ్డకో, వెళ్ళిపోగలిగినట్టయితే, ఎంత బావుండేది అనుకుంటాను చాలాసార్లు. కాని నా పిల్లల్ని రక్షించుకుని, , దేశాన్ని నా దేశస్తుల్ని హత్య చెయ్యటంలేదా?

అయినా, నాకు సమరం మీదనే ప్రేమ - కాని నా దేశం cause, దేశస్తులమీద గాని ఏ ప్రేమా లేదు. వాళ్ళ స్ట్రగుల్ మీద నా ప్రేమ, వారి మీద కాదు. వాళ్ళతో చేరనందుకు సిగ్గుపడతాను నాకూ తెలుసు, మీకూ తెలుసు, ఏదో లెక్చర్లు ఇవ్వడమూ, జైలుకువెళ్ళడం, మహా గొప్ప heroic పనికాదని . కాని ప్రజలు చచ్చిపోతున్నారు. నాకు చావంటే భయం లేదనుకుంటాను . కాని చావాలని లేదు, జీవితమంటే ప్రేమ నాకు. దేవుళ్ళోకాని, బతుకు తరూవాతి బతుకులోకాని , దేశంలో గాని నాకు విశ్వాసం లేదు. సమరంలో చేరనందువల్ల పిరికి వాణ్ణేమో నుకోడం పిరికితనంకాదా? అక్కడికి వెళ్ళి దేశానికి నేను చెయ్యగల ఉపకారంకంటే, వెళ్ళకండా ఉండడం వల్ల నా వాళ్ళకి చేసే ఉపకారం చాలా యెక్కువ. M.R. అన్నట్టు యీ త్యాగం out of proportion.

ఇదంతా తన భీరుత్వాన్ని సమర్దించుకోడానికి నా మనసు అల్లుకున్న వేదాంతమేమో? ఇట్లా ఆలోచించుకుంటో నిర్వీర్యుణ్ణిగా వుంటున్నాను. నా యోచన మీకు అర్థమయిందనుకుంటాను. నన్ను ప్రోత్సహించే ఆలోచన ప్రేమ కాదు. పిరికినని నన్ను నేనే నిందించుకోడంవల్ల కలిగే బాధ. కాని యీ ఉద్యమం మొదటిరోజుల్లో శిబిరాల్లోని మహోత్సాహాన్ని చూసినపుడు, గొప్ప అనుభవాన్ని మిస్ అవుతున్నాననిపించింది. ప్రతికక్షుల అన్యాయాన్ని, అబద్దాన్ని చదివినప్పుడు నా రక్తం వుడుకుతుంది... కాని వారివల్ల బాధితులైనవాళ్ళ మీద జాలి అన్నా కలగదు నాకు. గాంధీ గారు కాక ఇంకెవరు మాట్లాడినా నాలో ఏ సంచలనమూ కలగదు.

డాక్టరు ఉద్యమంలో పనిచేస్తున్నారు. జైలుకి చాలా దగ్గిరగా వున్నారనిపించింది ఆమె. కాని నా నిరుత్సాహం ఆమె మనసు మీద పనిచేసినట్టుంది. మాలతీబాయుగారు చాలా ఉత్సాహం చూపుతున్నారు మాటలతో. షౌ, వసంత్, అందరూ orthodox. డాక్టరు రోజూ రెండుగంటలు వొడుకుతారు. మీరు వొచ్చి మమ్మన్ని చూడకూడదూ? మీ పద్యాలతో, మీ ఆత్మనించి మాధుర్యంతో నిండిన మీ కవిత్వంతో వొచ్చి , మాలో నవజీవనం కల్పించరాదూ? మిమ్మన్ని రమ్మనడం స్వార్థం. డబ్బు దొరికితే, వొచ్చేవారం అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను. కాని ఎక్కడా వుండలేను. home sick అవుతాను. కొత్త ఇళ్ళలో వూళ్ళలో నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది.


దీక్షితులుగారికి చెలం రాసిన ఉత్తరంలోంచి





Print this post

1 comments:

Bolloju Baba on April 8, 2009 at 8:16 PM said...

భలే ఉండి మీ పోస్టు

నాకూ ఒక్కోసారి అనిపించేది. అంత ఉదృతంగా స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న సమయంలో చలం అలా పువ్వులగురించి, మానవసంబంధాలగురించీ స్వేచ్చగురించీ మాట్లాడేడే తప్ప సగటు మధ్యతరగతి ఇంటలెక్చువల్ లా ఉద్యమం పట్ల ఆకర్షితుడవ్వడు.
చాలా చోట్ల ఉద్యమ పోరాటంలో ఉన్న హిపోక్రిసీ పట్ల తన విసుర్లు విసురుతూనే వచ్చాడు.

యోగ్యతా పత్రంలో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అన్ద్ తాట్స్ దేశభక్తి కన్నా హీనం అనటాం, మ్యూజింగ్స్ లో చాలా చోట్ల ఇలాంటి డెక్కరింపులు అనేకం ఉంటాయి.
చలం అనే ఒక ఆలోచనా ఝురి ఉద్యమం, దేశభక్తి, పెళ్లి అనే శృంఖలాలచే బంధింపబడేది కాదేమో.
ఏమో మీ టపా చదివినతరువాత కూడా నాకు క్లారిటీ రాలేదు :-). సరదాగా

కొన్ని విషయాలలో చలం ఎప్పటికీ అర్ధం కాడేమో!

ఈ అంశంపై మరిన్ని విశ్లేషణలను వినాలని ఉంది.

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile